అక్షరటుడే, ఇందూరు: గత పది నెలలుగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ లో నిర్వహించిన విజయోత్సవ సభ ఫెయిలయిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుజరాతీ గులామని సీఎం రేవంత్ రెడ్డి అనడం, రేవంత్ రెడ్డి ఇటలీ గులామని కిషన్ రెడ్డి అంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. కేసీఆర్ ను తిట్టడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని, వరంగల్లో రైతుల సభ కాదని బూతుల సభ అని అన్నారు. ఏడాది కాలంలో ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదని, అన్ని అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. పార్టీని, కేసీఆర్ ని రేవంత్ రెడ్డి ఏమీ చేయలేడన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు హామీలు అమలు చేయని సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోతారన్నారు. రేవంత్ రెడ్డి అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ జోలికి వస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందన్నారు. నగర మేయర్ భర్త దండు శేఖర్ పై కాంగ్రెస్ గుండాలు కావాలనే దాడి చేయించారన్నారు. కాంగ్రెస్ కు కొమ్ము కాస్తున్న పోలీసుల పేర్లు పింక్ బుక్ లో ఎక్కిస్తున్నామని, వచ్చేది కేసీఆర్ రాజ్యమేనని చెప్పారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ విఠల్ రావు, నుడా మాజీ ఛైర్మన్ ప్రభాకర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సుజీత్ సింగ్ ఠాకూర్, రవిచందర్, అభిలాష్ రెడ్డి , సంతోష్ తదితరులు పాల్గొన్నారు.