అక్షరటుడే, కామారెడ్డి: కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ విమర్శించారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలు ఆరు గ్యారంటీలు అని చెప్పి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం మాత్రమే కల్పించారన్నారు. ఆర్టీసీకి డబ్బులు ఇవ్వకుండా సంస్థను నష్టాల్లోకి నెట్టారని విమర్శించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి కొత్త జిల్లాలను రద్దు చేసే కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే కరెంట్‌ కష్టాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. బీజేపీ రాముడి పేరిట ఓట్లు అడగడం తప్పా దేశానికి చేసిన మేలు ఏమీ లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. ఆ పార్టీ నేతలు వాగ్ధానాలను మరిచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ పాల్గొన్నారు.