అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : బెటాలియన్‌ పోలీసుల ఆందోళనపై బీఆర్‌ఎస్‌ నేత,మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎక్స్‌వేదికగా స్పందించారు. ‘ముఖ్యమంత్రి, హోం మంత్రి సంపూర్ణ వైఫల్యం వల్లనే నేడు టీజీఎస్పీలో ఉద్రిక్త వాతవరణం నెలకొంది. యూనిఫాం ధరించిన స్పెషల్‌ పోలీసులు తామే ఉద్యమకారులై ధర్నాల్లో పాల్గనడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నడూ అభిలషణీయం కాదు, కానీ వాళ్లకు ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఎందుకొచ్చిందో ఒకసారి ఆలోచించాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ల శాఖ మంత్రిగారైన రేవంత్‌ రెడ్డి తమ డిమాండ్ల పైన కనీసం ఒక స్టేట్‌మెంట్‌ అయినా ఇవ్వకుండా మౌనవ్రతం పాటిస్తూ మరింత జఠిలం చేస్తున్నారనేదే వాళ్ల ఆరోపణ ఆవేదన. ఆయన సకాలంలో స్పందించి ఉంటే ఈసమస్య తలెత్తేది కాదు.ఈఅసలు పని చెయాల్సిన సీఎం అటెన్షన్‌ డైవర్షన్‌ లాంటి వికృత చేష్టలకు దిగుతున్నారు. పోలీసు కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పే రేవంత్‌రెడ్డి ఎన్నికల ఇచ్చిన వాగ్దానాలమీదనే పోలీసు కుటుంబాలు పోరాడుతున్నాయి కదా. అసంతృప్తితో ఉన్న కానిస్టేబుళ్ల మానస్థిక పరిస్థితి తెలంగాణ డీజీపీ జితేందర్‌కు తెలవంది కాదు. వాళ్ల పేదరికం, గ్రామీణ నేపథ్యం, కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సస్పెన్షన్లను, బర్తరఫ్‌లను వెంటనే ఉపసంహరించుకోగలరు. ఈఆందోళన సందర్భంగా చాలా సమస్యలు (బెటాలియన్లలో వెట్టిచాకిరీ, అవినీతిలాంటివి) మీ దృష్టికి వచ్చుంటాయి. వాటి పరిష్కారాలకు త్వరితగతిన వ్యవస్థీకృత చర్యలు చేపట్టగలరు. పోలీసు మిత్రులకు మనవి దయచేసి సంయమనం పాటించండి’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశారు.