అక్షరటుడే, కామారెడ్డి: ప్రజల నుంచి ఫీజు వసూలు చేయకుండా ఎల్‌ఆర్‌ఎస్(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) వర్తింపజేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఇదే డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ధర్నాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కామారెడ్డిలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లి ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ పూర్తి చేయకుండా అడ్డుకుందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్నందున జీరో ఫీజుతో రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో ‘నో ఎల్‌ఆర్‌ఎస్ – నో కాంగ్రెస్’ అనే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.
విద్యాశాఖ మంత్రి లేకపోవడం దారుణం
రాష్ట్రంలో ఒకవైపు విద్యార్థులు చనిపోతున్నా కాంగ్రెస్ కేవలం రాజకీయాలు చేస్తోందని కవిత అన్నారు. కనీసం రాష్ట్రానికి విద్యా శాఖ మంత్రి లేకపోవడం దారుణమన్నారు. బోధన్ లోని బీసీ హాస్టల్ ఘటనలో మృతి చెందిన విద్యార్థి వెంకట్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. హాస్టల్లో గొడవలు ఆపడానికి కనీసం వార్డెన్ కూడా లేరని, ఫలితంగా నిండు ప్రాణం పోయిందని అవేదన వ్యక్తం చేశారు. సత్వరమే బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సురేందర్, ముజిబుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.