ఎంపీ అర్వింద్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తా..!

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ అర్వింద్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఓడిస్తానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శపథం చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్లలో అర్వింద్ ను ఓడించానని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఓడిస్తానని పేర్కొన్నారు. అదే తన ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. అయితే తాను పోటీ చేసే విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను బొందపెట్టాలని చూస్తున్నాయని, అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికైనా బీజేపీతో కలుస్తారని ఆరోపించారు. బీజేపీ సహకారంతో పదేళ్ల పాటు అధికారంలో ఉంటానని ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదని, ప్రజా వ్యతిరేక పాలన అని ధ్వజమెత్తారు. జీవో 3కి వ్యతిరేకంగా తాము తలపెట్టిన ధర్నాకు అనుమతించాల్సిందేనని, ఒకవేళ పర్మిషన్ ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని కవిత స్పష్టం చేశారు