అక్షరటుడే, వెబ్ డెస్క్: లోక్ సభ ఎన్నికల వేళ పార్లమెంట్ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రైతు, గల్ఫ్ సంక్షేమ సంఘం నేత కోటపాటి నరహింహం నాయుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు కోటపాటి. ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఈయన పసుపు బోర్డు కోసం రైతుల పక్షాన అనేక పోరాటాలు చేశారు. వివిధ రాష్ట్రాలు, దేశాల్లో జరిగిన రైతు వేదికల్లో పాల్గొన్నారు. ప్రధానంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమించారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డుపై ప్రకటన చేసిందని, కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపి గెజిట్ కూడా విడుదల చేసిందని కోటపాటి తెలిపారు. అందుకే తాను గులాబీ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు. పసుపు రైతుల చిరకాల స్వప్నం నెరవేర్చిన ఎంపీ అరవింద్, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటానని వెల్లడించారు.