అక్షరటుడే, వెబ్ డెస్క్ : కాంగ్రెస్‌, బీజేపీ బంధంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులపై ఈడీ దాడులు జరుగుతున్నా ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులను ఈడీ నుంచి రక్షిస్తున్న పెద్దన్న ఎవరని నిలదీశారు.

ఫిక్షన్‌ కంటే వాస్తవం వింతగా ఉంటుందని అంటుంటారని.. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే దాన్ని నమ్మక తప్పడం లేదని కేటీఆర్‌ అన్నారు. అందుకు సంబంధించిన రెండు ఘటనలను ట్విట్టర్‌(ఎక్స్‌) ద్వారా వివరించారు. తెలంగాణలో ఒక సంపన్నమైన కాంగ్రెస్‌ మంత్రి నివాసంలో రెండు వారాల కిందట ఈడీ దాడి చేసిందని తెలిపారు. ఆ దాడిలో వందల కోట్ల నగదు దొరికిందని మీడియాలో కథనాలు వస్తున్నాయని అన్నారు. అయితే ఇప్పటికీ కాంగ్రెస్‌ గానీ.. బీజేపీ నుంచి గానీ.. ఈడీ నుంచి గానీ దానిపై నోరు మెదపలేదని పేర్కొన్నారు.

కర్ణాటకలో జరిగిన వాల్మీకి కుంభకోణం ద్వారా వచ్చిన రూ. 40 కోట్ల అక్రమ ధనాన్ని పార్లమెంటు ఎన్నికల సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌ ఉపయోగించినట్లు ఈడీ వెల్లడించిందని కేటీఆర్‌ గుర్తుచేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు ఏమీ జరగలేదన్నారు.