పోచారం రాజకీయ వారసుడు ఆయనే..

0

అక్షరటుడే, బాన్సువాడ: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. తన తదుపరి రాజకీయ వారసుడు భాస్కర్‌రెడ్డేనని తేల్చేశారు. పోచారంనకు ముగ్గురు కుమారులు కాగా.. భాస్కర్‌రెడ్డి చిన్న కుమారుడు . ఇటీవల ఈయన డీసీసీబీ ఛైర్మన్‌ పదవిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో పోచారం తన రాజకీయ వారసుడిగా భాస్కర్‌రెడ్డి పేరును ప్రకటించడం చర్చకు దారితీసింది. సోమవారం నిర్వహించిన బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తన రాజకీయ వారసత్వంపై కేసీఆర్‌తో సైతం చర్చించానని తెలిపారు. రెండో కుమారుడు సురేందర్‌రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారని.. కానీ, రాజకీయ వారసుడు మాత్రం భాస్కర్‌రెడ్డేనని స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మొదటి కుమారుడు రవీందర్‌రెడ్డి వైద్యుడు కాగా.. రెండో కుమారుడు సురేందర్‌రెడ్డి తండ్రి వెంటే రాజకీయాల్లో ఉన్నారు. చిన్న కుమారుడు భాస్కర్‌రెడ్డి మొన్నటి వరకు డీసీసీబీ ఛైర్మన్‌గా పనిచేశారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదు..

ఈమధ్య కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో తాను కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీలు మారే సంస్కృతి తనది కాదని పోచారం స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌లో తనకు ఎంతో గౌరవం ఉందని.. ఎన్నో పదవులు అనుభవించానని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ పార్టీని వీడబోనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.