అక్షరటుడే, వెబ్డెస్క్: BSNL | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన BSNL వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. జూన్ నుంచి 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ఇటీవల కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటగా దేశ రాజధాని ఢిల్లీ(DELHI)లో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో 5G సేవలపై పైలట్ టెస్టింగ్ కూడా నిర్వహించారు. ఢిల్లీలో ప్రారంభించిన తర్వాత క్రమంగా అన్ని నగరాలకు విస్తరించనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ 5G సేవలు అందుబాటులోకి వస్తే వినియోగదారులు మెరుగైన డాటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి ప్రయోజనాలను పొందగలుగుతారు.
BSNL | సర్కార్ అండతో..
టెలీకాం రంగంలో గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL ను ప్రోత్సహిస్తోంది. ఈ సంస్థను పునరుజ్జీవింపజేయడానికి గతేడాది బడ్జెట్‌లో రూ. 80 వేల కోట్లకుపైగా కేటాయించింది. సంస్థ సామర్థ్యాలను పెంపొందించడానికి, నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడుతున్నాయి. 5జీ సేవలు కూడా అందుబాటులోకి వస్తే బీఎస్‌ఎన్‌ఎల్ ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లతో పోటీ పడగల స్థాయికి ఎదుగుతుందని భావిస్తున్నారు.
BSNL | పెరుగుతున్న కస్టమర్లు..
ప్రైవేట్ టెలికాం(TELECOM) ఆపరేటర్లు గతేడాది జూలైలో రీచార్జి ప్లాన్‌ల ధరలు గణనీయంగా పెంచాయి. ఎయిర్‌టెల్, వీఐ, జియో వంటి ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోల్చితే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌లో రీచార్జి(RECHARGE) ప్లాన్‌ల ధరలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా సంస్థల కస్టమర్లు చాలామంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతటా 4జీ సేవలు కూడా లేకపోవడం ఆ సంస్థకు ప్రతిబంధకంగా మారాయి. 4జీ, 5జీ సేవలు అంతటా అందుబాటులోకి వస్తే బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు మరింత మంది మారే అవకాశాలు ఉంటాయి.