అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: నగరంలోని వ్యాపార సముదాయాలను ఎట్టి పరిస్థితుల్లో రాత్రి 10.30 గంటలకు మూసివేయాల్సిందే..! లేదంటారా.. సిటీ పోలీస్ యాక్టు కింద కేసు నమోదు చేస్తారు. మరోసారి పట్టుబడితే వ్యాపార సంస్థ సీజ్‌కు ఆదేశాలిస్తారు. లైసెన్సులు సైతం రద్దు చేస్తారు. పండుగలు, ఎన్నికలు ముగియడంతో తిరిగి కమిషనరేట్ పోలీసులు రంగంలోకి దిగారు. రాత్రి వ్యాపారం నిర్వహించే వారిపై కొరడా ఝులిపిస్తున్నారు. ఇదివరకు నిజామాబాద్ రైల్వే స్టేషన్, నెహ్రూపార్క్, బోధన్ రోడ్డు, సారంగపూర్‌లోని పలు హోటళ్లు, బార్లు, టీకొట్లు, పాన్ డబ్బాలు అర్ధరాత్రిళ్లు తెరిచి ఉండేవి. సీపీ కల్మేశ్వర్ ఆదేశాలతో.. గత నాలుగైదు రోజులుగా రాత్రి గస్తీ నిర్వహించే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హోటల్, పాన్ డబ్బా ఏది తెరిచి ఉన్నా వెంటనే ఫొటో తీసి పెట్టీ కేసు నమోదు చేస్తున్నారు. గతంలో అర్ధరాత్రి వరకు దుకాణాలు తెరిచి ఉండడంతో రోడ్లపై పోకిరీలు తిరుగుతూ మద్యం మత్తులో హంగామా సృష్టించే వారు. ఇక నుంచి ఎవరైనా అకారణంగా రోడ్లపై తిరిగినా కఠిన చర్యలుంటాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అర్ధరాత్రిళ్లు వ్యాపారాలు నిర్వహిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. యాజమాన్యాలు తప్పకుండా పోలీసుల సూచనలు పాటించాల్సిందేనని ఒకటో టౌన్ ఎస్ హెచ్ వో విజయ్ బాబు సూచించారు.