అక్షరటుడే, వెబ్ డెస్క్: రతన్ టాటా ఒకసారి పెంపుడు శునకం ఒకదానికి అనారోగ్యంగా ఉండడంతో చివరి నిమిషంలో లండన్ ట్రిప్ రద్దు చేసుకున్నారట. ఈ విషయాన్ని బిజినెస్ మ్యాన్ నిరంజన్ హీరానందాని గుర్తుచేసుకున్నారు. ఈమేరకు ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. ‘నాకు ఆ అవార్డు ఏంటో సరిగా గుర్తులేదు కానీ.. దానిని స్వీకరించేందుకు రతన్ టాటా లండన్ ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఉన్నట్టుండి ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కారణం ఏమిటా అని అందరూ ఆరా తీస్తే.. చివరకు తెలిసిందేంటంటే.. ఆయన పెంపుడు శునకం అనారోగ్యానికి గురవడంతో దానిని బెడ్ పై తన పక్కనే పడుకోబెట్టుకొని జాగ్రత్తగా కనిపెట్టుకున్నారు. అత్యంత నిరాడంబరంగా ఉండే టాటాకు సంబంధించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయమది” అని హీరానందాని కొనియాడారు.

వీధి శునకాల కోసం ప్రత్యేక గది

రతన్ టాటా మూగజీవాలపై ప్రేమను ఎప్పుడూ దాచుకోలేదు. ఆయన తన వ్యాపార సామ్రాజ్య ప్రధాన కార్యాలయమైన బాంబేహౌస్ లో వీధి శునకాల కోసం ఏకంగా ప్రత్యేక గదినే కేటాయించారు. అవి ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. వర్షాకాలం వచ్చిందంటే వాహనదారులకు ఆయన ఎప్పుడూ ఒక రిక్వెస్ట్ చేస్తుండేవారు. ‘వానల్లో మన కార్ల కింద పిల్లులు, వీధి కుక్కలు తల దాచుకుంటుంటాయి. కారు స్టార్ట్ చేసే సమయంలోనూ, ముందుకుపోనిచ్చేప్పుడు దాని కింద ఒకసారి తనిఖీ చేసుకోండి. లేకపోతే అవి తీవ్రంగా గాయపడటమో, అవయవాలను కోల్పోవడమో, చనిపోవడమే జరుగుతుంది. ఈ వర్షాకాలంలో మీరు మూగజీవాల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటుచేస్తే.. ఉపయోగకరంగా ఉంటుంది’ అని ఎప్పుడూ కోరుతుండేవారు.