అక్షరటుడే, వెబ్‌డెస్క్: Money : కాసుల కోసం మహిళతో మాట కలిపి కల్లు తాగించి ఖతం చేసే కసాయిని మెదక్ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో 10 మంది మహిళలను హత్య చేసి, పలుమార్లు జైలుకు వెళ్లాడని పోలీసులు గుర్తించారు. నర్సాపూర్ ఠాణాలో ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి కేసు వివరాలను వివరించారు.
నర్సాపూర్ మండలం జయరాం తండాకు చెందిన భుజాలీ(52) మార్చి 25న కూలి పనుల కోసమని వెళ్లి అదృశ్యమైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. కల్లు దుకాణం వద్ద గుర్తుతెలియని వ్యక్తితో భుజాలీ ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు.
నర్సాపూర్‌లో మెదక్ మార్గంలో ఉన్న ఓ దాబాకు ఎదురుగా గల అటవీ ప్రాంతంలోకి ఇరువురు వెళ్లినట్లు నిర్ధారించుకుని, అక్కడికి వెళ్లి చూడగా.. మార్చి 28న కుళ్లిన స్థితిలో భుజాలీ మృతదేహం కనబడింది. వెంట వెళ్లిన వ్యక్తి పాత నేరస్థుడని తేలింది.
నిందితుడిని మహబూబ్‌నగర్ జిల్లాలోని అయ్యగారిపల్లి తండాకు చెందిన కెతావత్ గోపాల్, అలియాస్ డప్పు గోపాల్(54)గా గుర్తించారు. నర్సాపూర్‌లో శుక్రవారం గోపాల్ అనుమానాస్పద స్థితిలో కనిపించగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భుజాలీని హత్య చేసినట్లుగా ఒప్పుకొన్నాడు. ఆమె వద్ద ఉన్న రూ.400 కోసం నిండు ప్రాణం తీశాడు.