అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నూతన టెక్నాలజీ సాయంతో ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండానే ఓ రోగికి ఎల్‌ఎంసీఏ స్టంట్‌ను అమర్చామని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్‌ గోపికృష్ణ రాయిడి తెలిపారు. శుక్రవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కమ్మర్‌పల్లి మండలం దమ్మన్నపేట అమీర్‌నగర్‌కు చెందిన గుగులావత్‌ నందు(49) గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. పదేళ్ల క్రితం కవాటాలు మూసుకుపోవడంతో బైపాస్‌ ఆపరేషన్‌ చేసి మైట్రల్‌వాల్‌ను అమర్చారు. ప్రస్తుతం తిరిగి సమస్య రావడంతో చాలా మంది వైద్యులను సంప్రదించాడు. వైద్యులందరూ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలని తెలిపారు. గోపికృష్ణ రాయిడిని సంప్రదించడంతో హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ యశోద హాస్పిటల్‌లో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ అవసరం లేకుండా.. ఎల్‌ఎంసీఏ స్టంట్‌ను అమర్చారు. దీంతో రోగి బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. వైద్యుడు గోపికృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.