అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: ఇందూరు కేంద్రంగా క్యాసినో కింగ్‌లు పుట్టుకొచ్చారు. గోవా, శ్రీలంక, మలేషియాతో పాటు వివిధ ప్రాంతాలకు క్యాసినో ఆడేందుకు టీమ్‌లుగా తయారు చేసి పంపిస్తున్నారు. ఒక్కో టీమ్‌లో వంద మందికిపైగా ఉంటున్నారు. వీరి ద్వారా ఒక్కోక్కరి వద్ద కనీసం రూ.లక్షన్నర నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. వాటికి బదులు టోకెన్లు ఇచ్చి క్యాసినో ఆడిస్తున్నారు. ఇలా దాదాపు నెలకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు మనీ లాండరింగ్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో మాక్లూర్‌ మండలం గత్పకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి భర్త కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇతనితో పాటు మరో నలుగురు సిండికేట్‌గా మారి క్యాసినో దందాను నడిపిస్తున్నారు. ప్రత్యేకించి యువత, విద్యార్థులు, పేకాట అలవాటు ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని క్యాసినోకు బానిసలుగా మారుస్తున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది రూ.లక్షలు పోగొట్టుకొని రోడ్డున పడిన దాఖలాలు ఉన్నాయి. గతంలో క్యాసినోకు సంబంధించి మూలాలు బయట పడినప్పటికీ.. పోలీసులు మొక్కుబడి చర్యలు తీసుకొని వదిలేశారు. రెండో టౌన్‌ పరిధిలో ఓ ఖరీదైన వాహనం పట్టుబడగా అందులో క్యాసినోకు వినియోగించే కాయిన్స్‌ దొరికాయి. ఆ కేసులో పైపైన విచారణ జరిపి చేతులు దులుపుకున్నారు. ఐదుగురితో కూడిన సిండికేట్‌ తాజాగా గోవాకు 150 మందితో కూడిన మూడు రోజుల ట్రిప్ కోసం ప్లాన్‌ చేసింది. ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల చొప్పున వసూలు చేశారు. కాగా.. ఈ సిండికేట్ లో డిచ్పల్లి సర్కిల్ పరిధిలో పనిచేసే ఓ కానిస్టేబుల్ కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు క్యాసినో కింగ్‌లపై దృష్టి పెట్టి ఆట కట్టించాల్సిన అవసరం ఉంది. కొత్తగా బాధితులు పుట్టుకురాకుండా చర్యలు చేపట్టాలి.