అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్: ధరణి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. ఆయన శనివారం హైదరాబాద్ సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధరణి సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా రూపొందించిన నూతన ఆర్‌వోఆర్ ముసాయిదా బిల్లు-2024పై ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు సీసీఎల్‌ఏ వెబ్‌సైట్ ద్వారా అవకాశం కల్పించిందని తెలిపారు. ఈ నెల 2 నుంచి 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ప్రజలు ఎవరైనా సరే తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చన్నారు. సలహాలు, సూచనలను ఈ మెయిల్ (ror2024-rev@telangana.gov.in) ద్వారా తెలపవచ్చని సూచించారు. పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చని తెలిపారు.
అనంతరం జిల్లాలోని తహసీల్దార్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు జారీచేశారు. జిల్లాలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. సుదీర్ఘ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న వాటిని ముందుగా పరిశీలన జరిపి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్డీవోలు రాజేంద్రకుమార్, రాజాగౌడ్ పాల్గొన్నారు.