అక్షరటుడే, వెబ్డెస్క్ : Kukatpally | ఎండలు మండుతున్నాయి. భానుడి దెబ్బకు బయటకు వెళ్లగానే దాహం వేస్తోంది. దీంతో చాలా మంది సమీపంలోని ఇళ్లలో వారిని నీరు అడుగుతారు. ఇంటికి ఎవరొచ్చి నీరు అడిగినా ఇస్తాం. అయితే అలా నీరు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితులు వచ్చాయి. మంచినీరు కావాలని వచ్చి చోరీలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో ఇలాంటి ఘటనే జరిగింది. మంచినీరు కావాలని దుండగుడు ఓ ఇంట్లోకి వెళ్లి అడిగాడు. ఆ ఇంట్లోని మహిళ నీళ్లు ఇస్తుండగా ఆమె మెడలోని చైన్ లాక్కోని పారిపోయాడు. 2.5 తులాల గొలుసు పోయిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Kukatpally | ఒంటరి మహిళలే లక్ష్యంగా..
గొలుసు దొంగలు ఒంటరి మహిళలు, వృద్ధులే లక్ష్యంగా చోరీలు చేస్తున్నారు. ఒంటరిగా ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి మెళ్లిగా వెళ్లి నీరు, అడ్రస్ కోసం అని వెళ్లి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారు.
Kukatpally | జాగ్రత్తగా ఉండాలి
చైన్ స్నాచర్లు, దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే బయటకు రాకుండానే వారిని పంపించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.