అక్షరటుడే, కామారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ పక్కాగా చేపట్టాలని ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులకు దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వీసీలో పాల్గొన్నారు. బీఎల్‌వోలకు శిక్షణ ఇచ్చి ఎస్‌ఎస్‌ఆర్–2025లో భాగంగా ఈనెల 20 నుంచి ఇంటింటి సర్వే చేపట్టాలని, కొత్త ఓటరు నమోదుతో పాటు మార్పులు, చేర్పులు చేపట్టాలని ఆర్డీవోలను ఆదేశించారు. మరణించిన వారి పేర్ల తొలగింపు కోసం డెత్ సర్టిఫికెట్ లేదా పంచనామా రిపోర్టు తప్పనిసరిగా చూపాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, ఎలాంటి తప్పులు లేకుండా, ఓటరు జాబితా సవరణ చేపట్టి నెలాఖరులోగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వలస ఓటర్ల పేర్ల తొలగింపు కోసం ముందుగా వారి కుటుంబీకులకు నోటీసులు ఇచ్చి వారం గడువు ఇవ్వాలన్నారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో రంగనాథచారి పాల్గొన్నారు.