అక్షరటుడే, వెబ్ డెస్క్: తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని వీసీ యాదగిరి రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం యాదగిరిరావు మంగళవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. అందుకే విద్యారంగంలో విశేషమైన అనుభవం ఉన్న ప్రొఫెసర్లను పారదర్శకంగా వీసీలుగా నియమించామని తెలిపారు. త్వరలోనే యూనివర్సిటీల్లోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో పనిచేసి.. రాష్ట్రంలోనే మోడల్ వర్సిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు.