అక్షరటుడే, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలు సహా మేనిఫెస్టోపై కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి  ఎకరానికి రూ.250 చొప్పున భూమికేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు, ప్రస్తుతం ఉన్న హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పరిధి పెంచాలని నిర్ణయం తీసుకుంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్‌పై చర్చించిన కేబినెట్ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సన్న వడ్లకు రూ.500 బోనస్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రెరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్‌సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ భూమి బదలాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది.