అక్షరటుడే, నిజామాబాద్: నకిలీ పత్రాలతో పాస్పోర్టులు సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచి ఏఎస్సై లక్ష్మణ్ ను సీఐడీ అదుపులోకి తీసుకుంది. మంగళవారం తెల్లవారుజామున నిజామాబాద్ కు వచ్చిన సీఐడీ సిబ్బంది గంగాస్థాన్ లోని నివాసంలో లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈయన మాక్లుర్, నవిపేట్ ఎస్బీ ఇంఛార్జిగా ఉన్నారు. తాజాగా సీఐడీ పోలీసులు నకిలీ పత్రాలతో పాస్పోర్టులు పొందుతున్న ఓ ముఠాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పలు జిల్లాలకు చెందిన 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. కస్టడీ విచారణ చేసిన సమయంలో భీంగల్ కు చెందిన నిందితుడు సుభాష్ కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఏఎస్సై లక్ష్మణ్ ను సీఐడీ విచారణ నిమిత్తం తీసుకెళ్ళింది. తదుపరిగా ఏం జరుగుతుంది అనేది స్పెషల్ బ్రాంచి విభాగంలో ఉత్కంఠగా మారింది.