అక్షరటుడే, బోధన్: పట్టణంలోని బీసీ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో ఉండే ఇంటర్ విద్యార్థులు ఆదివారం రాత్రి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. దీంతో డిగ్రీ విద్యార్థి వెంకట్ (23) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బోధన్ లోని బీసీ హాస్టల్ లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ స్వగ్రామం గాంధారి మండలం తిప్పారి తండా. వెంకట్ మృతితో కుటుంబీకులు, బంధువులు సోమవారం పట్టణంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. హత్యకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు నిందితులైన ఆరుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై శాఖా పరమైన విచారణ చేస్తున్నామని బీసీ వెల్ఫేర్ అధికారి రమేష్ తెలిపారు. నైట్ వాచ్ మెన్ ను విధుల నుంచి తొలగించామని, వార్డెన్ పైన కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
