అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పిల్లల చదువుపై తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలని, వారు స్మార్ట్‌ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలిక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్- టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. ‘‘ డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మాదక ద్రవ్యాలు మానవసంబంధాలను నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. డ్రగ్స్ రక్కసిని అణిచివేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
కడప మున్సిపల్ హైస్కూల్ లో డిప్యూటీ సీఎం పవన్
పేరెంట్స్ – టీచర్స్ మీట్ లో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్ లో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విద్యార్థులతో పవన్ ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు.