అక్షరటుడే, వెబ్డెస్క్: Chandrababu | ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో జరిగిన ఎన్నికలు, 2019 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి గల కారణాలను సీఎం ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు. తన రాజకీయ ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన 2004, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి ఎవ్వరూ కారణం కాదని.. తాను ఓడిపోవడానికి స్వయంగా తానే కారణమని స్పష్టం చేశారు.
నన్నెవరూ ఓడించలేదు, ఆయా ఎన్నికల్లో నా ఓటమికి కారణం నేనే అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయలేకపోవడం వల్లనే ప్రజలు తమకు వ్యతిరేకంగా ఓటేశారని చంద్రబాబు స్పష్టం చేశారు. కొన్ని పనులను పూర్తి చేయలేకపోవడం వల్లనే ఓడిపోయామన్నారు చంద్రబాబు.
Chandrababu | పార్టీలో సమన్వయం లోపించింది
ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాలనలో నిమగ్నమై ఉండటం వల్ల పార్టీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో సరైన సమన్వయం జరగలేదన్నారు. ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపగలిగితే ఓటమి వచ్చే అవకాశమే లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తన భవిష్యత్తు పాలనపై మరింత జాగ్రత్తలు తీసుకునే సూచనగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.