అక్షరటుడే, వెబ్‌డెస్క్ : పదేళ్లలో కేసీఆర్ చేయలేని పనులను చేసి చూపిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ గడీలను కూల్చేందుకు పాదయాత్ర చేశానన్నారు. బుధవారం వేములవాడ ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు పని చేసి ఉంటే సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయన్నారు. మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. బండి సంజయ్‌ను రెండు సార్లు ఎంపీ గా గెలిపిస్తే కరీంనగర్ అభివృద్దికి ఏమైనా చేశారా , కేంద్రం నుంచి బీజేపీ నేతలు ఏమైనా నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. కరీంనగర్ గడ్డపై ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తుందన్నారు. కరీంనగర్ జిల్లా ఉద్యమాలకు నాయకత్వం వహించిందన్నారు.