అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకెళ్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రధాని మోదీకి ట్వీట్‌ చేశారు. మా ప్రభుత్వం గురించి ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో అనేక అపోహలు, అవాస్తవాలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండురోజుల్లోనే రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల ఇన్సూరెన్స్‌ కల్పించామని పేర్కొన్నారు. మా పాలన మొదటి ఏడాదిలోపే 22 లక్షలకు పైగా రైతులకు రుణమాఫీ చేశామన్నారు. 200 యూనిట్ల వరకు గృహావసరాలకు ఉచితంగా విద్యుత్‌ అందజేస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గ్యాస్‌ సిలిండర్ల ధరలు పెరిగినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌ పాలనలో రూ. 500కే సిలిండర్‌ ఇస్తున్నామని ట్వీట్‌లో వివరించారు. తమ పాలనలో ఇప్పటివరకు 50వేలకు పైగా ఉద్యోగాలిచ్చామన్నారు. మూసీ నది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.