అక్షరటుడే, వెబ్‌డెస్క్: కర్నాటకలో ప్రభుత్వ గ్యారంటీ స్కీంలు అమలు కావడం లేదంటూ మహారాష్ట్రలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నందుకు బీజేపీపై కేసు నమోదు చేస్తామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో మంగళ్‌వేధా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. తమ రాష్ట్రంలో గ్యారంటీ స్కీంల అమలును చూసేందుకు సిద్ధమైతే ప్రధాని మోదీ సహా ఇతర బీజేపీ నేతల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయిస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. మోదీ సహా బీజేపీ నేతలంతా అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారని విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రకటనలను ఉపసంహరించుకొని, మహారాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.