అక్షరటుడే, కామారెడ్డి టౌన్‌: ఇంటింటా ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. కామారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించిన ‘వాక్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌’ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నిజాంసాగర్‌ చౌరస్తా నుంచి గవర్నమెంట్‌ డిగ్రీ కాలేజీ వరకు సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో ఆవిష్కరణల స్ఫూర్తిని రేకెత్తించడంతో పాటు తెలివైన ఆలోచనలతో ప్రతిభావంతులను గుర్తించడమే వాక్‌ఫర్‌ ఇన్నోవేషన్‌ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమ 6వ ఎడిషన్‌ కోసం ఆగస్టు 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రంగనాథ్‌, డీపీవో శ్రీనివాస్‌, డీఈవో రాజు, మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, డీడబ్ల్యూవో బావయ్య, డీఎస్‌వో సిద్ధిరాం రెడ్డి, ఈడీఎం ప్రవీణ్‌, తహసీల్దార్‌ జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు.