అక్షరటుడే, కామారెడ్డి: జిల్లాలో డోర్ టు డోర్ సర్వే పకడ్బందీగా చేపడతామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో సర్వే కోసం మొత్తం 2,366 మంది ఎన్యుమరేటర్లను నియమించామన్నారు. గ్రామాల్లో 2023, పట్టణాల్లో 350 మంది ఎన్యుమరేటర్లు సర్వే చేస్తారన్నారు. ఉపాధ్యాయులు, అంగన్ వాడీ టీచర్స్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు, ఐకేపీ, మెప్మా సిబ్బంది సర్వేలో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,90,462 కుటుంబాలు ఉంటాయని అంచనా వేయడం జరిగిందన్నారు. ప్రతి ఎన్యుమరేటర్ కు గ్రామాల్లో 150, పట్టణాల్లో 125 ఇళ్లను కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. సర్వే మానిటరింగ్ కోసం మండలాల్లో ప్రత్యేకాధికారులను నోడల్ అధికారులుగా నియమించడం జరిగిందని, జిల్లా స్థాయి సర్వేను సక్రమంగా నిర్వహించేందుకు కలెక్టర్ జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. రెండు దఫాలుగా సర్వే జరుగుతుందని, మొదటి దఫాలో ప్రతి ఇంటికి ఇంటి యజమాని పేరుతో స్టిక్కర్ అతికిస్తారని, రెండో దఫాలో ఇంటింటికి తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు సేకరిస్తారన్నారు. ఎన్యుమరేటర్ అడిగిన వివరాలు కుటుంబ సభ్యులు తెలపాలని సూచించారు. సర్వే పూర్తయిన తర్వాత వివరాలన్నీ కంప్యూటరైజ్ చేయడం జరుగుతుందన్నారు. సర్వేకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.