అక్షరటుడే, కామారెడ్డి : పోలీసు అమరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. సోమవారం పోలీస్ అమరుల వారోత్సవాలు సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్మారక స్తూపం వద్ద కలెక్టర్ తో పాటు ఎస్పీ సింధూశర్మ నివాళులర్పించారు. వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీసు అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దేశ అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో పోలీస్ వ్యవస్థ కీలకంగా పని చేస్తుందన్నారు. శాంతిభద్రతలు సక్రమంగా ఉంటే మారుమూల గ్రామాలకు కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
అమరుల ఆశయాలు కొనసాగిద్దాం : ఎస్పీ
పోలీసు అమరుల ఆశయాలను కొనసాగిద్దామని ఎస్పీ సింధూశర్మ అన్నారు. కామారెడ్డి జిల్లాలో అంతర్గత భద్రత పరిరక్షణ విధుల్లో ఏడుగురు పోలీసులు అసువులు బాసారన్నారు. పోలీసుల త్యాగనిరతిని నిరంతరం మననం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు 300 గజాల ప్లాటు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు నాగేశ్వరరావు, శ్రీనివాసులు, యాకూబ్ రెడ్డి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ జార్జ్, తిరుపయ్య, సీఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.