అక్షరటుడే, కామారెడ్డి: భవన నిర్మాణ, ఇతర కార్మికులు కార్మిక శాఖలో తమ పేరు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై జిల్లాస్థాయి అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కార్మిక చట్టం ప్రకారం భవనం నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటి నిర్మాణానికి అయ్యే వ్యయం విలువలో ఒక శాతం సెస్ వసూలు చేసి కార్మిక శాఖకు సమర్పించాలన్నారు. ఈ విధంగా వసూలు చేసిన సెస్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖలో రూ.110 చెల్లించి పేరు నమోదు చేసుకోవడం వల్ల వారు అనేక బెనిఫిట్స్ పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్మిక కమిషనర్ కోటేశ్వర్లు, సీపీవో రాజారాం తదితరులు పాల్గొన్నారు.