అక్షరటుడే, కామారెడ్డి: భారీ వర్షాల కారణంగా కల్వర్టుల పైనుంచి వరద నీరు ప్రవహించే అవకాశం ఉండడంతో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. జిల్లాలోని 27 రోడ్లలో కల్వర్టులపై సూచికలు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రత్యేకాధికారులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు వస్తే ప్రజలు కల్వర్టుల మీదుగా ప్రయాణించకుండా చూడాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ రవిశంకర్, డీపీవో శ్రీనివాసరావు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.