అక్షరటుడే, నిజామాబాద్‌ టౌన్‌ : కుటుంబ సభ్యుల వివరాల సేకరణ, డిజిటల్‌ కార్డుల జారీ కోసం పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. డిచ్‌పల్లి మండలం సాంపల్లిలో, ఆర్మూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోని మున్సిపల్‌ వార్డు నెంబర్‌-2 పరిధిలో డిజిటల్‌ కార్డుల సర్వే ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. ఫ్యామిలీ డేటా బేస్‌ ఆధారంగా అధికారులు సర్వే నిర్వహిస్తున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇంటి నెంబరు, చిరునామా, కుటుంబ యజమాని, ఇతర కుటుంబ సభ్యులకు యజమానితో ఉన్న సంబంధం వంటి వివరాలను పక్కాగా సేకరించాలన్నారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, బోధన్‌ ఆర్డీఓ రాజాగౌడ్‌, కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత, కమిషనర్ రాజు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.