అక్షరటుడే, బోధన్: జిల్లాలో కొనసాగుతున్న అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్స్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. శుక్రవారం బోధన్ లోని భవన సముదాయం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏటీసీల్లో తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. సొంత భవనాలు అందుబాటులోకి వచ్చేలోపు ప్రత్యామ్నాయంగా ఐటీఐలలో తరగతులను నిర్వహించాలన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యంపై అధికారులను ప్రశ్నించగా, వర్షపు నీరు ఉండడంతో పనులు ఆలస్యమయ్యాయని, ఫిబ్రవరిలోపు పూర్తి చేస్తామని కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహశీల్దార్ విఠల్, వైస్ ప్రిన్సిపాల్ సరోజినీ దేవి తదితరులున్నారు.