అక్షరటుడే, వెబ్‌డెస్క్: బోధన్‌లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున ఇరవై మంది వరకు డయాలసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు వివరించారు. ఏకకాలంలో ఏడుగురు చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని పేర్కొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యులకు సూచించారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లోని సౌకర్యాలను పరిశీలించారు. ఇన్ పేషంట్లతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని చెప్పారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్ కె.గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములు, ఆర్ఎంవో అబ్దుల్ రహీం తదితరులున్నారు.