అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ధర్పల్లి మండలం సీతాయిపేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం సేకరించారనే విషయాలను నిర్వాహకులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 629 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సన్న రకం, దొడ్డు రకం వడ్లను వేర్వేరుగా సేకరిస్తున్నట్లు తెలిపారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపించాలని, రైతుల వివరాలను యాప్ లో నమోదు చేసి డబ్బు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు.