అక్షరటుడే, నిజామాబాద్: ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేసుకునే వారికి తగిన సమాచారం తెలియజేస్తూ, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా.. జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల అంశంపై శుక్రవారం అధికారులతో సమీక్షించారు.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) లోనూ కంట్రోల్ రూమ్ నెంబర్ 08462 – 220183 కు కార్యాలయాల పని వేళల్లో సంప్రదించవచ్చని సూచించారు. పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్రంగా పరిశీలిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సర్వే నెంబర్లు, ప్లాట్ అప్లికేషన్ల సంఖ్య, రోడ్డు విస్తీర్ణం, ఇనాం భూమి, ఇరిగేషన్ ల్యాండ్ వంటి అంశాలను పక్కాగా పరిశీలించాలని సూచించారు.
సమీక్షలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.