అక్షరటుడే, ఆర్మూర్‌: జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌ సీజన్‌లో కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. డిసెంబర్‌ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశాలున్నాయన్నారు. నందిపేట మండల కేంద్రంతో పాటు డొంకేశ్వర్‌ లో సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ శుక్రవారం సందర్శించారు. జిల్లాలో ఈసారి 670 పైచిలుకు కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను జరుగుతోందన్నారు. సన్నాలకు రూ.500 చొప్పున బోనస్‌ డబ్బులు కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. కలెక్టర్‌ వెంట ఆర్మూర్‌ ఆర్డీవో రాజాగౌడ్‌ తదితరులున్నారు.