అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు వరదనీరు పోటెత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు సూచించారు. ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో సోమవారం సీపీ కల్మేశ్వర్‌తో కలిసి సందర్శించారు. ఏకధాటిగా కురుస్తున్న భారీవర్షాలకు పెద్దఎత్తున ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1088.8 అడుగుల (72.6 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రస్తుతం 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. దీంతో 40 ఫ్లడ్‌ గేట్ల ద్వారా గోదావరిలోకి లక్షా 63వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని కలెక్టర్‌కు అధికారులు వివరించారు. ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నామని తెలిపారు. కలెక్టర్‌ స్పందిస్తూ ప్రస్తుత లెవెల్‌ వద్ద నీటి నిల్వలను మెయింటైన్‌ చేస్తూ, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోకు అనుగుణంగా వరద జలాలను దిగువకు విడుదల చేయాలని ఆదేశించారు. ఎస్సారెస్పీ దిగువ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకూడదన్నారు. అవాంఛనీయ ఘటనలు సంభవించకుండా అధికారులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఆర్డీవో రాజాగౌడ్‌, ఎస్సారెస్పీ ఎస్‌ఈ శ్రీనివాస్‌ తదితరులున్నారు.