అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యతో జగిత్యాలలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డితో పాటు పలువురు నేతలు ఆందోళనకు దిగారు. గంగారెడ్డిని హత్య చేసిన నిందితుడిని వెంటనే పట్టుకోవాలని ధర్నా చేపట్టారు. దీంతో జగిత్యాల ఎస్పీ జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని జీవన్‌రెడ్డితో మాట్లాడారు. నిందితుడిని పట్టుకుంటామని ఆందోళన విరమించాలని కోరగా.. ఆయన పోలీసుల తీరుపై మండిపడ్డారు. హత్య చేసిన నిందితుడు సంతోష్‌తో ఎస్సైకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని గంగారెడ్డి డయల్‌ 100కు ఫోన్‌ చేసినా పట్టించుకోలేదన్నారు. నిందితుడిని పట్టుకునే వరకు కదిలేదిలేదని స్పష్టం చేశారు. అలాగే సొంత పార్టీపై ఫైర్‌ అయ్యారు. ‘కాంగ్రెస్‌ రాజ్యంలో కాంగ్రెస్‌ నేతలకే రక్షణ కరువైందని’ మండిపడ్డారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం.. కాంగ్రెస్‌ పార్టీలో ఎన్నో అవమానాలు భరిస్తున్నానంటూ’ విరుచుకుపడ్డారు.