అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో ఆయనను సస్పెండ్ చేసినట్లు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
కులగణనపై వ్యాఖ్యలతో..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇటీవల కుల గణన సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కులగణనను తప్పు పడుతూ పలు స్టేట్మెంట్లు ఇచ్చారు. పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడారు. దీంతో క్రమశిక్షణ కమిటీ ఆయనకు నోటీసులు ఇచ్చింది. అయితే నోటీసులకు ఆయన వివరణ ఇవ్వకపోవడంతో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆది నుంచి వివాదస్పదమే..
తీన్మార్ మల్లన్న వ్యవహార శైలి ఆది నుంచి వివాదస్పదమే. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ ఛానెల్ ద్వారా పరోక్ష పదజాలంతో దూషణలు చేయడం, ఆరోపణలు గుప్పించడం వివాదస్పదమైంది. ఈక్రమంలో ఆయనపై పలుమార్లు కేసులు నమోదయ్యాయి. అనంతరం జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి కాషాయ పార్టీ పెద్దలను కలిపి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఆ పార్టీలోని నేతలతో పొసగకపోగా.. అదే పార్టీపై విమర్శలు మొదలుపెట్టారు.
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు. మల్కాజ్‌గిరి స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున అసెంబ్లీ టికెట్ దక్కుతుందని ఆశించినా ఫలించలేదు. తీరా హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీగా బరిలో నిలిచి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన అధికార కాంగ్రెస్ పార్టీపై మిమర్శనాస్త్రాలు సంధించడంపై చర్చ జరిగింది. ప్రత్యేకించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి.
ఇటీవల బీసీల సభలో పాల్గొన్న మల్లన్న.. రెడ్డి సామాజిక వర్గంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ సామాజిక వర్గం నుంచి తీవ్ర నిరసనలు మూటగట్టుకున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనికి తోడు మంత్రులు సహా ప్రభుత్వంపై విమర్శలు ఆపలేదు. ఈ నేపథ్యంలో మల్లన్నను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.
