అక్షరటుడే, వెబ్డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎంఎంటీస్(MMTS) రైలులో అత్యాచారయత్నం ఘటనపై స్పందించారు. శాంతిభద్రతల విషయంలో ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఎంఎంటీఎస్ ఘటనలో తక్షణమే చర్యలు తీసుకున్నామని తెలిపారు. కానీ బీఆర్ఎస్(BRS) నాయకులు రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా లేవని ప్రచారం చేస్తూ పెట్టుబడులు రాకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ హయాంలో అనేక నేరాలు జరిగాయని అప్పుడు ఏం చేశారని సీఎం(CM) ప్రశ్నించారు. న్యాయవాదులు వామనరావు దంపతులను నడిరోడ్డుపై చంపితే ఎటువంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. నిందితులను తప్పించడానికి ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్(Jublee Hills) అత్యాచారం కేసులో బీఆర్ఎస్ నేత కుమారుడు నిందితుడిగా ఉన్నా చర్యలు తీసుకోలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం ఎలాంటి ఘటన జరిగినా వెంటనే చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.