అక్షరటుడే, ఇందూరు: CP Sai Chithanya | నిజామాబాద్ కమిషనరేట్ నూతన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య(Cp Sai Chaitanya) నేడు బాధ్యతలు తీసుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకోసం కమిషనరేట్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
అనంతరం ఆయన కమిషనరేట్ పరిధిలోని ఉన్నతాధికారులతో జిల్లాలో తాజా పరిస్థితులపై సమీక్షించనున్నారు. తిరిగి సాయంత్రం సీఐలు, ఎస్‌హెచ్‌వోలతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
కాగా.. కల్మేశ్వర్ బదిలీ అయిన తర్వాత నిజామాబాద్ సీపీగా కొత్తగా ఎవరినీ నియమించలేదు. అయిదు నెలల పాటు సింధు శర్మ ఇంఛార్జి సీపీగా పని చేశారు. ఈ సమయంలో పలువురు అధికారులు ఇష్టారీతిన వసూళ్లు, సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పలువురు ఇసుక అక్రమ రవాణాకు అండదండలు అందిస్తున్నారు. కొత్తగా వచ్చిన పోలీస్ బాస్ వీటన్నింటిపై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది.