అక్షరటుడే ఇందూరు: Additional Collector | రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా.. మరికొన్ని వెనుకంజలో ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలని సూచించారు.
Additional Collector | రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలు..
వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అర్హత కలిగిన రైస్ మిల్లర్లకు బ్యాంకు గ్యారంటీలను మంజూరు చేయాలని తెలిపారు. వ్యవసాయ శాఖతోపాటు పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖలు సమన్వయం చేసుకొని ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి చేయూతనివ్వాలని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తిస్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. వీధి వ్యాపారులకు ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. సమావేశంలో ఆర్బీఐ ఎల్డీవో పృథ్వీ, డీఆర్డీవో సాయా గౌడ్, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ అశోక్ చవాన్, నాబార్డ్ ఏజీఎం ప్రవీణ్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.