అక్షరటుడే, హైదరాబాద్: MLA quota MLC : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భారాస అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు నేడు దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ కట్టబెట్టారు. సామాజిక సమీకరణాలు, ఉద్యమ చరిత్ర, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని శ్రవణ్ పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
పార్టీ అభ్యర్థిత్వం రేసులో మొదట పలువురి పేర్లు వినిపించాయి. గిరిజన సామాజిక వర్గం ఆధారంగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌కు టికెట్ ఇస్తారని మొదట ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పోటీలో ఉన్నారు. ఆయనపై మంచి అభిప్రాయం ఉండడంతో టికెట్ ఖాయమనే అందరూ భావించారు. సీనియర్ జర్నలిస్ట్ టంకశాల అశోక్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్లు కూడా వినిపించాయి. అయితే చివరి వరకు సస్పెన్స్ కొనసాగించిన అధినేత కేసీఆర్.. ఆఖరికి దాసోజు పేరు ప్రకటించారు.