అక్షరటుడే, ఇందూరు : పదేళ్ల కాలంలో హామీలు అమలు చేయని బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌పై ఆరోపణలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార సంస్థ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి మండిపడ్డారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పథకాల అమలుపై ఆరోపణలు చేస్తున్నారని.. జిల్లా అధ్యక్షుడిగా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, బీఆర్‌ఎస్‌ అధికారంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేసిందో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. నగరంలో భూకబ్జా బాధితులుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ప్రతితో సంప్రదిస్తే పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజారెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యుడు జావిద్‌ అక్రమ్, నాయకులు శేఖర్‌ గౌడ్, నరేందర్‌ గౌడ్, దయాకర్‌ గౌడ్, రేవతి, తదితరులు పాల్గొన్నారు.