అక్షరటుడే, ఇందూరు: బీఆర్ఎస్ పదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి, ప్రజాపాలన తెచ్చామని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో గత ప్రభుత్వం చేయనిది, ఏడాదిలో చేసి చూపించామన్నారు. ప్రజలకు అవినీతి లేని పాలనను అందిస్తున్నామన్నారు. ప్రధానంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 3 కోట్ల 26 లక్షల మంది ప్రయాణించారన్నారు. 200 యూనిట్లలోపు వినియోగదారులకు బిల్లులను మాఫీ చేశామన్నారు. అలాగే నిజాంషుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు రూ. 200కోట్ల అప్పు చెల్లించామని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే పునరుద్ధరిస్తామన్నారు. ఏడాది గడిచినా.. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కాలేదని స్వయంగా ప్రధాని ప్రకటించి కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ రేటు పెరగడానికి బీజేపీ, బీఆర్ఎస్ లే కారణమన్నారు. రైతు బీమాపై ప్రతిపక్షాలు లేనిపోని అపోహను సృష్టిస్తున్నాయని చెప్పారు. తొందర్లోనే రైతు బీమా పూర్తిస్థాయిలో చెల్లిస్తామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నూడా చైర్మన్ కేశ వేణు, నరాల రత్నాకర్, జావేద్, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు వేణు రాజ్, తదితరులు పాల్గొన్నారు.
రాక్షస పాలన నుంచి విముక్తి కల్పించి.. ప్రజా పాలన తెచ్చాం
Advertisement
Advertisement