TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలోనే నిర్ణయం
TUWJ | జర్నలిస్టుల ఆరోగ్య పథకంపై త్వరలోనే నిర్ణయం
Advertisement

అక్షరటుడే, ఇందూరు: TUWJ | రాష్ట్రంలోని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహా హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం అసెంబ్లీలోని ఛాంబర్​లో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో జర్నలిస్టులు అనుభవిస్తున్న కష్టాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

TUWJ | ఆర్థిక ఇబ్బందుల్లో జర్నలిస్టులు..

అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే జర్నలిస్టులకు వైద్యఖర్చులు మరింత భారంగా మారాయన్నారు. అప్పులు చేసి జర్నలిస్టులు వైద్యం పొందే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా మాట్లాడుతూ.. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కల్కురి రాములు, రాష్ట్ర కార్యదర్శి వరకాల యాదగిరి, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు రజనీకాంత్ తో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు.

Advertisement