అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth | తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను గోటీలు ఆడుకోవడానికి ఢిల్లీ వెళ్లడం లేదన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేపట్టడంతో పాటు కేంద్రం సాయం తీసుకుంటామని పేర్కొన్నారు. అందులో భాగంగానే తాను ఢిల్లీ వెళ్లానని స్పష్టం చేశారు.
CM Revanth | 32 సార్లు వెళ్లి వచ్చా..
తాను 15 నెలల పాలనలో 32 సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినట్లు ముఖ్యమంత్రి వివరించారు. అవసరం అయితే మరో 300 సార్లు పోతానని స్పష్టం చేశారు. మూడుసార్లు ప్రధానిని కలిశానని, కేంద్ర మంత్రులలో భేటీ అయ్యానని వివరించారు. అభివృద్ధి కోసం తాను ఢిల్లీ వెళ్తున్నానని, రాజకీయాల కోసం కాదన్నారు.
CM Revanth | ప్రధాని పెద్దన్న లాంటివారు
తాను ఢిల్లీకి రహస్యంగా వెళ్లలేదని సీఎం అన్నారు. కొందరు కేసుల మాఫీ కోసం, ఆస్తుల రక్షణ కోసం చీకట్లో ఢిల్లీ వెళ్తారని విమర్శించారు. తాను రాష్ట్ర అవసరాల కోసం ప్రధానిని కలిశానని వివరించారు. ప్రతి ముఖ్యమంత్రికి ప్రధాని పెద్దన్న లాంటి వారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ఢిల్లీ వెళ్లడంతోనే వరంగల్ ఎయిర్‌పోర్టు వచ్చిందన్నారు. తాను ఢిల్లీ వెళ్లి మరెన్నో నిధులు, అభివృద్ధి పనులు తీసుకొచ్చినట్లు వివరించారు.
CM Revanth | డబ్బులు వృథా చేయలేదు
తాను ఢిల్లీకి వెళ్లిన డబ్బులు వృథా చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. తాను ఒకటి రెండు సార్లు మాత్రమే చార్టెడ్ ఫ్లైట్‌లో వెళ్లానని మిగతా సమయాల్లో సామాన్యులతో పాటు కమర్షియల్ ఫ్లైట్‌లో జర్ని చేసినట్లు చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల సొమ్మును వృథా చేశారని విమర్శించారు. ఆయన తన సొంత మొక్కులను రాష్ట్ర ఖాజానా నుంచి డబ్బులు పెట్టి తీర్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ చార్టెడ్ ఫ్లైట్లలో తిరిగారని విమర్శించారు.