అక్షరటుడే, వెబ్ డెస్క్: తప్పుడు ధృవపత్రాలతో పాస్పోర్ట్ పొందిన కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనికి సహకరించిన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన వాహబ్ మొహమ్మద్ తప్పుడు పత్రాలతో తన పేరును హస్సన్ అబ్దుల్ గా మార్చుకుని పాస్పోర్ట్ పొందాడు. ఆ పాస్పోర్ట్ పై తాజాగా సౌదీకి వెళ్లాడు. అక్కడి ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడడంతో వారు తిరిగి ఇండియాకు పంపారు. అనంతరం ఇక్కడి ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో నిందితుడు దిగగానే అక్కడి పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ జరిపారు. రెడ్డిపేటకు చెందిన శంకర్ నాయక్ సాయంతో తప్పుడు పాస్పోర్ట్ పొందినట్లు తెలిపాడు. కాగా.. గురువారం ఢిల్లీ పోలీసులు శంకర్ నాయక్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇదే కేసులో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ జీరాక్స్ సెంటర్ యజమాని పరారీలో ఉన్నాడు.