అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ఢిల్లీలో వాయు నాణ్యత మరింత పతనమైంది. ఊపిరి పీల్చడం కష్టంగా మారింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 490కి పడిపోయింది. గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ఆంక్షలు విధించిన ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (సీఏక్యూఎం) తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్‌సీఆర్ పరిధిలో గ్రేటెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) – 4 నిబంధనలు అమలుకానున్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఢిల్లీలోని పాఠశాలల్లో కేవలం ఆన్‌లైన్ తరగతులే నిర్వహించనున్నట్లు సీఎం అతిశీ ప్రకటించారు.
నేటి నుంచి అమలవుతున్న నిబంధనలు
- ఢిల్లీలోకి ట్రక్కుల (నిత్యావసర వస్తువులు, సర్వీసులు అందించే ట్రక్కులు మినహా) కు ప్రవేశం లేదు. ఎల్ఎన్‌జీ, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, బీఎస్ – 6 డీజిల్ ట్రక్కులకు మాత్రమే అనుమతి. ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్‌తో ఉన్న తేలికపాటి కమర్షియల్ వాహనాలపై నిషేధం. ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ బీఎస్ – 4 అంతకన్నా పాత డీజిల్ రవాణా వాహనాల ప్రవేశంపై నిషేధం.
- అన్ని నిర్మాణ సంబంధిత కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ చేస్తూ ఆదేశాలు. హైవేలు, రోడ్లు, ఫ్లైఓవర్ వంతెనలు, పవర్ లైన్‌లు, పైపులైన్‌లు.. ఇలా నిర్మాణ సంబంధిత ప్రాజెక్టుల నిలిపివేత.
- ఎన్ఆర్‌సీ ప్రాంతంలో కార్యాలయాలన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేసేలా చూడటం. మిగతా వారికి వర్క్ ఫ్రమ్ హోమ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వొచ్చని సూచన.